విశాల ఐక్య సంఘటన కావాలి!
![]()
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండుతో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. ఈ విషయాన్ని పాదయాత్ర ప్రారంభించడానికి ముందుగానే రాజధాని నగరంలో, వరంగల్‌లో, పలుచోట్ల చెప్పాడు. మీడియాలో విస్తృత ప్రచారాన్ని పొందింది. గద్దర్ వరంగల్ నగరంలో కాలు మోపితే చంపేస్తామని, ఆయన పాదం మోపే నేలకింద మందుపాతరలు పెట్టి పేల్చివేస్తామని బ్లూ టైగర్స్ పేరుతో ఒక మీడియా ప్రకటన వచ్చింది.
ఈ బెదిరింపు ఎవరిచ్చినా దీని వెనుక ఉన్నది ప్రభుత్వమేననేది ప్రభుత్వానికీ తెలుసు, ప్రజలకీ తెలుసు. ఇటువంటి బెదిరింపులు ఇది మొదటిసారి కాదు. చివరిసారి కాకపోవచ్చు. ప్రభుత్వాలున్నంత కాలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమకారులు గొంతెత్తినంత కాలం ఈ బెదిరింపులు ఉంటూనే ఉంటాయి. ఎటువంటి హాని లేకుండా గద్దర్ యాత్ర ముగిసినప్పటికీ, ఇటువంటి బెదిరింపులను తేలికగా తీసుకోలేదు. పదకొండేళ్ల క్రితం 1997 ఏప్రిల్ 6వ తేదీన ఆయన ఇంటిమీదికి వచ్చి ఆయన గుండెల్లో గురి చూసి కాల్చారు. నాలుగు బుల్లెట్లు తొలగించినా ఆయన వెన్ను పూస బొక్క దగ్గర ఇంకా ఒక బులెట్ మిగిలే ఉన్నది. వరంగల్‌లో డిఎస్పీ స్థాయిలో ఉన్న ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు నాయకత్వం లోని ముఠా వచ్చి దాడి చేసిందని లోకానికంతా తెలుసు. కాని ఇప్పటికీ ఈ హత్యా ప్రయత్నంపై ఎటువంటి దర్యాప్తు లేదు. చర్యలేదు. ఈ కేసు మూసివేసామని కూడ ప్రభుత్వం ప్రకటించినట్లున్నది. గద్దర్‌కు ఎన్నో సందర్భాలలో బెదిరింపులు వచ్చాయి. వరంగల్ నుంచే వచ్చిన బెదిరింపు లేఖపై దర్యాప్తు జరిపి రాసిన వ్యక్తిని అరెస్టుచేసి కేసు కూడ పెట్టారు.
కాని చర్య లేదు. ఆరు నెలల క్రితం టి.ఆర్.ఎస్ నాయకులకు గద్దర్‌ను చంపుతామన్న బెదిరింపు లేఖ వచ్చింది. వాళ్లు హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఇంతవరకు ఎటువంటి దర్యాప్తు లేదు. చర్యలేదు. 1997 డిసెంబర్ 29, 30 తేదీల్లో వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు జరిగినప్పుడు (అప్పటికాయనపై హత్యా ప్రయత్నం జరిగి ఎనిమిది నెలలు మాత్రమే గడిచింది. వెన్నులో బులెట్ గాయం పచ్చిగానే ఉన్నది) ఢిల్లీలో చికిత్స చేయించుకొని నేరుగా ఆ సదస్సుకే వచ్చాడు. ‘నీ పాటనయి వస్తున్నానమ్మా’ అని పాటరాసింది అప్పుడే. ఆ సదస్సులోను, బహిరంగ సభలోను గద్దర్ పాల్గొంటే బహిరంగ సభవేదిక మీద మందుపాతర పెట్టి పేల్చివేస్తామని ఇటువంటి బెదిరింపు ప్రకటనలే వచ్చాయి.
‘అయితే గద్దర్‌తో పాటు ఇతర వక్తలతో పాటు నేను కూడ ఆ వేదిక మీద ఉంటాను. పేల్చివేస్తే పేల్చివేయండి. చూస్తాను’ అని ప్రజాకవి కాళోజీ ప్రకటించాడు. హనుమకొండ ములుగు రోడ్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు వేలాది మందితో ఊరేగింపు ఆగి , విశాలమైన జూనియర్ కాలేజి మైదానంలో మూడు లక్షల మందితో బహిరంగ సభ జరిగింది. ఆ వేదిక మీంచి మళ్లీ ప్రజాకవి కాళోజీ ప్రకటించాడు: ‘ఇదుగో ఈ వేదిక మీద గద్దర్‌తో పాటు నేను నిలబడి ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ప్రకటిస్తున్నాను. వేదిక కింద మందుపాతర పెట్టారో, మా మీద బాంబులు వేస్తారో - ఏంచేసినా మేం సిద్ధమే’ అని. బెదిరింపులకు, దాడులకు పదకొండేళ్లు గడిచినది.
గద్దర్ మీద 1997 ఏప్రిల్ 6న హత్యా ప్రయత్నం జరిగినప్పుడు సుందరయ్య విజ్ఞాన భవన్ వెలుపల జరిగినసభలో ప్రతి ఒక్కరు ఆయనపై దాడివెనుక మూడు కారణాలు ఉన్నట్లు ముక్తకంఠంతో విశ్లేషించారు. ఆయన నక్సలైట్ల మృతదేహాలు వారి బంధు మిత్రులకు అప్పగించాలన్న ఒక మానవీయమైన డిమాండుతో సంఘీభావ కమిటీ అనే ఒక ఐక్య విశాల కార్యాచరణకు నాయకత్వం వహిస్తున్నాడు. అప్పటికే భోనగిరి సభలో ప్రత్యేక తెలంగాణ డిమాండును ముందుకు తెచ్చిన శక్తులకు నాయకత్వం వహించాడు. కారంచేడు, చుండూరులలో దళితుల హత్యాకాండను ఖండిస్తూ గళమెత్తాడు. గద్దర్ గాయకుడు మాత్రమే కాదు నాయకుడు కూడ అవుతున్నాడని ప్రభుత్వం భయపడుతున్నది అని. తేడా అల్లా అప్పుడు అది చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడిది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు ప్రభుత్వాల కాలంలోను ఎన్‌కౌంటర్లు ఉన్నాయి.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ మృతదేహాల రీ-పోస్ట్ మార్టమ్ కోసం, రక్తబంధువులకు అప్పగించడం కోసం ఒక పోరాటమే చేయాల్సి వస్తున్నది. కాకపోతే ఇందుకు అమరుల బంధు మిత్రుల సంఘం వంటి రాష్ట్ర వ్యాప్త సంస్థ ఒకటి ఏర్పడి, పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాల, వ్యక్తుల సహకారంతో ఆ డిమాండులకు హైకోర్టు నుంచి కొంత సాధికారితను సాధించింది. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండు-ప్రజాసంఘాలకు, ఉద్యమాలకే పరిమితమైనా, ప్రత్యేక తెలంగాణ డిమాండు మాత్రం కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీల డిమాండు కూడ అయింది.
ఇందులో ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి ఎంతటితో ప్రజానీకానికి స్పష్టంగానే తెలుసు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వీటినుంచి ఆశించగలిగిన భరోసా ఏమీ లేదు.కనుక బెదిరింపులు, దాడుల నుంచి గద్దర్‌నే కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షలను కాపాడుకోవడానికి ప్రజాస్వామిక శక్తుల విశాల ఐక్య సంఘటనయే సరియైన హామీ.
Tuesday 16 Dec 2008 | వరవరరావు | వ్యాసాలు, తెలుగు, AndhraJyothy