V.P Singh
లోక్‌సభలో 1990 సెప్టెంబర్‌ 6న మండల్‌ కమిషన్‌ నివేదికపై జరిగిన చర్చకు ప్రధాని వి.పి.సింగ్‌ ఇచ్చిన సమాధానంలోని కొన్ని భాగాలివి.

అణగారిన లేదా వెనుకబడిన కులాల్లో పుట్టిన ఒక వ్యక్తి జీవిత పర్యంతం అనేక అవమానాలను ఎదుర్కోవలసివుంది. చితిపై ఒక వ్యక్తి ఒక్కసారే కాలిపోతాడు; అయితే అణగారిన కులాల్లో పుట్టిన వ్యక్తులు తమ జీవితాంతం అడుగడుగునా అవమానాల పాలవుతారు. మీకే ఆ అవమానాలు ఎదురయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. గౌరవపూరితమైన చావును అంగీకరించడానికి ఎవరూ వెనుకాడరు; అయితే నిత్యం అంతులేని అవమానాలతో బతకడానికి ఎవరు ఇష్టపడతారు? రిజర్వేషన్ల మూలంగా సమాజం చీలిపోయిందని, రిజర్వేషన్ల విధానంతో బడుగు వర్గాలవారు అభ్యున్నతి చెందలేరని విమర్శిస్తున్నారు. నిజానికి రిజర్వేషన్ల వ్యవస్థ ఒకటి శతాబ్దాలుగా అమలులో ఉంది.

అయితే ఎవరి కోసం ఆ రిజర్వేషన్ల వ్యవస్థ అమలులో ఉంది? తమ మలమూత్రాలను ఎత్తి పారవేసే కులం శాశ్వతంగా కొనసాగేలా చేసేందుకే ఆ రిజర్వేషన్‌ వ్యవస్థ నేర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చి నలభై రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు అటువంటి పనిచేయడానికి ఆ కులం వారు సిద్ధంగా లేరు. అయితే ఆ రిజర్వేషన్‌ వ్యవస్థ ఇప్పటికీ యావత్‌ సమాజాన్నీ గట్టిగా ప్రభావితం చేస్తోంది. తత్ఫలితంగా అణగారిన వర్గాలు, పేదలు, వెనుకబడిన కులాల వారి పురోగమనానికి తీవ్ర అవరోధంగా పరిణమించింది. ఆ వ్యవస్థ దేశాన్ని కూడా విభజించింది. ఈ చీలిక ప్రభుత్వోద్యోగాల విషయంలో మాత్రమే. ఇది వేతన భత్యాలకు సంబంధించిన ప్రశ్న కాదు. ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్లను అమలుపరచడం ద్వారా మాత్రమే ఒక నిర్దిష్ట సామాజిక వర్గంవారి అభ్యున్నతికి భరోసా కల్పించగలము. సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది.

ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్లతో పాటు మన సామాజిక వ్యవస్థలో మార్పులు కూడా తీసుకురావలసివుంది. ఈ మార్పులను తీసుకురావడాన్ని ఎక్కడ, ఏ విధంగా ప్రారంభించాలి? మనకు ఒక సామాజిక వ్యవస్థ, ఒక ఉద్యోగస్వామ్య వ్యవస్థ ఉన్నాయి. సామాజిక వ్యవస్థను బట్టే ఉద్యోగస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకొంది. సమాజమే చాలా శక్తివంతమైనది. సమాజంలో మార్పులు తీసుకురావాలంటే విధాన నిర్ణయాలు తీసుకునే సంస్థ అయిన ఉద్యోగస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకురావలసివుంది. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అన్నిటినీ ఉద్యోగస్వామ్య వ్యవస్థలోని అధికారులే తీసుకుంటారు. సమాజంలోని అణగారిన వర్గాలనుంచి వచ్చిన విద్యావంతులకు ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ప్రవేశం కల్పించాలి. అప్పుడే మనం సామాజిక సంస్కరణల గురించి ఆలోచించగలం. కనుక ఈ సంస్కరణల అంశం ఉద్యోగాలు, ఉపాధితో మాత్రమే ముడివడివుంది. అణగారిన వర్గాలవారు 40 శాతం ఉద్యోగాలను పొందగలిగితే పాశ్వాన్‌ మాదిరిగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. అధికారంలో ఉన్నవారికి మాత్రమే అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

ఇంతకూ రిజర్వేషన్ల విధానం సాధించిన ఫలితమేమిటి? షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతుల వారికి ప్రభుత్వోద్యోగాలలో ఇరవై రెండున్నర శాతం వాటా కల్పించాము. క్లాస్‌-1 ఉద్యోగాలలో ఇరవై రెండున్నర శాతం రిజర్వేషన్‌ అమలుకు బడుగువర్గాలవారికి భరోసా ఇవ్వడం జరిగింది. పేదరికం నిర్మూలనా కార్యక్రమాలు, గిరిజనుల సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలు మొదలైనవి కొనసాగాయి. అయినా బడుగు వర్గాలవారిలో ఎనిమిదిన్నర శాతం మంది మాత్రమే క్లాస్‌-1 ఉద్యోగాలకు చేరగలిగారు. విద్యా రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బడుగు వర్గాలవారికి ప్రయోజనం కల్పించాలనే సూచన ఒకటి వుంది. ఈ సూచనను తప్పకుండా అమలుపరుస్తాం. ఇంత సానుకూల వైఖరి అవలంభించినా 43 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా క్లాస్‌-1 ఉద్యోగాలలో వెనుకబడిన కులాలవారికి నాలుగున్నర శాతం వాటా కూడా దక్కడం లేదు.

కొన్ని సదుపాయాలను సమకూర్చడమే సరిపోదు. అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కూడా చాలా ముఖ్యం. చేయవలసింది అదే. పాలనలో పాల్గొనడానికి ఇంతవరకు అనుమతించని వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం సంకల్పించింది. జీవనోపాధి సాధించుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించేందుకే మేము ఈ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. అణగారిన వర్గాలను అధికార సంస్థలలో భాగస్వాములను చేసేందుకే ఈ రిజర్వేషన్లు కల్పించాము. బడుగు వర్గాల వారి సంక్షేమానికి ఎంత ఖర్చు పెడతున్నామనేది ప్రశ్న కాదు. ఆ వర్గాలవారికి అధికారంలో ఎంత వాటా ఇస్తున్నామనేది ప్రశ్న. ఆర్థిక కారణాల వలనే ఆ వర్గాలవారు పేదరికంలో మగ్గుతున్నారని కదా మనం భావిస్తున్నది. అయితే ఈ అంశాన్ని అధికారంలో భాగస్వామ్యం అనే విషయం నుంచి వేరుగా చూడలేము. సహస్రాబ్దాల క్రితం బయటినుంచి వచ్చిన ఆర్యులు ఈ దేశ వాసులైన ద్రావిడులను ఓడించి తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. ఓడిపోయినవారు అణగారిన ప్రజలుగా మిగిలిపోయారు.

ఈ కారణంగానే మన సమాజపు అధికార వ్యవస్థలో ఈ ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పోయింది. వారిని ఇతరులతో సమానంగా ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే వారిని అధికార వ్యవస్థలో భాగస్వాములను చేయక తప్పదు. దేశ పౌరులందరూ సమానులేనని రాజ్యాంగం చెప్పినంత మాత్రాన బడుగు వర్గాల వారు ఇతరులతో సమానులై పోరు. అణగారిన వర్గాలవారిని ‘ సమానులు’గా పేర్కొనడమంటే వారికి అన్యాయం చేయడమే. పేదలు, బడుగు వర్గాలకు న్యాయం చేయాలంటే పార్లమెంటు, శాసనసభలతో సహా విధాననిర్ణయ సంస్థలన్నిటిలోనూ ఆ వర్గాల వారికి 40 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలి. కచ్చితంగా చెప్పాలంటే మేమూ రిజర్వేషన్లను కోరుకోవడం లేదు. ప్రస్తుతం మనమెదుర్కొంటున్న సమస్యలకు రిజర్వేషన్లు శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ సమకూరిస్తే ఎలాంటి రిజర్వేషన్ల అవసరం లేదు.

ప్రస్తుతం అమలు పరుస్తోన్న రిజర్వేషన్లు అన్నిటినీ ఉపసంహ రించుకోవడం సాధ్యమవుతుంది. ఎస్‌సిలు, ఎస్‌టిలకు కల్పిస్త్తున్న రిజర్వే షన్లనన్నిటినీ నిలిపివేయవచ్చు. అయితే ఒక వ్యాధికి సక్రమంగా, సంపూర్ణంగా చికిత్స చేయనప్పుడు క్రోసిన్‌ తీసుకోమని రోగికి డాక్టరు సలహా ఇస్తాడు. అదే విధంగా అణగారిన వర్గాలవారి అభ్యున్నతికి తగు సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరముంది. వారికి గృహ వసతి కల్పించాలి. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు ప్రత్యా మ్నాయంగా సుస్థిరమైన జీవనోపాధి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లు ఒక మంత్రదండం వంటివని మేము చెప్పడం లేదు. అయితే సమగ్ర పరిష్కారం దిశగా రిజర్వేషన్లు కచ్చితంగా ఒక ముందడుగే.

అత్యధిక సంఖ్యాకులకు సంక్షేమాన్ని సమకూర్చి , అన్ని రంగాలలో వారిని సాధికా రికులను చేయడానికి మేము రిజర్వేషన్ల పథాన్ని అనుసరించడం ప్రస్తుత వ్యవస్థతో ఘర్షణను తీసుకువస్తున్నది. అయితే అటువంటి ఘర్షణ ద్వారా మాత్రమే అందరికీ సమానావకాశాలు కల్పించే సామాజిక వ్యవస్థ అవిర్భవిం చగలదు. రిజర్వేషన్లు అనే ఈ ఆయుధానికి ఎలాంటి సృజనాత్మక శక్తి లేదని ఎవరైనా విశ్వసిస్తే కచ్చితంగా వారు పొరపడుతున్నారని చెప్పక తప్పదు.