నిరసనలను, బయట ప్రదర్శనలను ఉత్సవాల్లో పాల్గొన్న కొందరు వక్తలు తప్పు పట్టినట్లుగా, అసహనం ప్రదర్శించి నట్లుగా చదివినప్పుడు, ఆ వక్తలు విప్లవ సాహిత్యాభిమానులు అని కూడ తెలిసినపుడు కాలం ఎంత మారింది అనిపించింది.

ఇప్పుడున్న భాషా సాహిత్య వాతావరణంలో 1970, 80ల తొలి రోజులను తలచుకుందాం. 1963-65 మధ్యకాలంలో ‘నవత’ వంటి ఉత్తమ కవిత్వ పత్రిక నిర్వహించిన ‘నక్షత్ర సప్తకం’ 70 జూలై 3,4 తేదీల్లో హైదరాబాదులో ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ పేరుతో రెండు రోజుల సదస్సు నిర్వహించి ఆహ్వానిస్తే దిగంబర కవులు, తిరుగబడు కవులు, కె.వి.రమణారెడ్డి నిరాకరించారు. ‘అభ్యుదయ సాహిత్య వేదిక’ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మొదట మొహమాటపడిన శ్రీశ్రీ హైదరాబాదు దాకా వచ్చి అందులో పాల్గొనలేదు.

కొడవటిగంటి కుటుంబరావు అయితే ‘కసాయివాడు జీవకారుణ్య సదస్సు పెడితే భూతదయ గలవారంతా పొలోమని పోవల్సిందేనా?’ అని ఎల్లకాలాలకు పనికి వచ్చే ఒక ప్రమాణాన్ని ప్రతిపాదించాడు. ‘అభ్యుదయ సాహిత్య వేదిక’కే అంత అభ్యంతర మెందుకు? నక్షత్ర సప్తకం ఒక సాహిత్య, సాంస్కృతిక సంస్థయే గదా. ఎందుకంత అభ్యంతరం? ఆ వేదిక వెనుక ఇంకెవరెవరున్నారు? అభ్యుదయ రచయితల సంఘం ఉంది. సిపిఐ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు. సినిమా పరిశ్రమ ఉంది. ఇవన్నీ ఇప్పటి ప్రగతి భావుకులకు అభ్యంతరకరం కాకపోవచ్చు. కాని వీటి వెనుక కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉంది.

ఆ ప్రభుత్వం అప్పటికే 1969 మే నుండి శ్రీకాకుళ ఆదివాసి రైతాంగ పోరాటాన్ని ఎన్‌కౌంటర్ల పేరుతో నెత్తుటి ఏర్లలో ముంచుతున్నది. సిపిఐఎం శ్రీకాకుళ పోరాటాన్ని అతివాద బాలారిష్టం అన్నది. దుందుడుకువాదం అన్నది. నక్సల్బరీ, శ్రీకాకుళాల వెనుక సిఐఎ కుట్రను కూడ అనుమానించింది. బ్రహ్మానందరెడ్డి చేతులమీదుగా శ్రీశ్రీకి రెండు వేల రూపాయల పర్సు బహుకరించి ఆయనతో శ్రీకాకుళ పోరాటం అతివాద దుస్సాహసమని, ఆ విప్లవకారులు ‘దారి తప్పిన తమ్ముళ్ళ’ని అనిపించాలన్నది అభ్యుదయ సాహిత్య వేదిక ఆకాంక్ష. ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎంవి నారాయణరావు.

ఆయన శ్రీకాకుళ ఉద్యమాన్ని ‘కల్లోలిత ప్రాంతాల చట్టం’, పోలీసు క్యాంపులు, ఎన్‌కౌంటర్లతో అణచివేయాలని సూచించి అమలుచేసిన పోలీసు అధికారి. ఐపిఎస్‌. ఆ తర్వాత డిఐజి (నక్సలైటు), డిజిపి, హోంకార్యదర్శి కూడ అయ్యాడు. ఆయన శ్రీశ్రీ వీరాభిమాని. మహాప్రస్థానం కంఠోపాఠం కూడ. ఆయనే తర్వాతికాలంలో ‘కిన్నెర ఆర్ట్స్‌’ సాహిత్య సంస్థ నెలకొల్పి ఎనభైలలో శ్రీశ్రీ, సరోజలను ఆహ్వానించి సన్మానించాడు. ఈ కిన్నెర ఆహ్వానాన్ని ఆమోదించవద్దని విరసం సంస్థ ఆయనకు విజ్ఞప్తి చేసింది. కాజీపేట రైల్వేష్టేషన్‌లో వరంగల్‌ విరసం యూనిట్‌ శ్రీశ్రీని కలిసి అభ్యంతరం చెప్పింది. పునరాలోచించుకొమ్మన్నది. హైదరాబాదు విరసం యూనిట్‌ సన్మానం జరిగే సభ ముందు ధర్నా చేసి నిరసన తెలిపింది.

శ్రీశ్రీ, సరోజలు వినలేదనేది నిజమే కాని ఎం.వి.నారాయణరావు గారి కిన్నెర స్వభావం ఏమిటో విరసం లోకానికి తెలియజేయగలిగింది. ఇంకొక దృశ్యం; గుంటూరులో 1975 మేలో రాడికల్‌ యువజన సంఘం ఏర్పర్చడానికి మహాసభలు తలపెట్టారు. విరసం కార్యవర్గ సభ్యుడు సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఆహ్వాన సంఘం కార్యదర్శి. ఈ మహాసభల ముందు ప్రచారం కోసం జననాట్యమండలి బృందాన్ని హైదరాబాదు నుంచి పిలిచారు. ప్రదర్శనలిస్తూ గుజ్జనగూళ్లలో సభ జరుగుతుండగా పోలీసులు సభను భగ్నం చేసి సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ను జననాట్యమండలి భూపాల్‌, నిర్మల (నిమ్మి), సంధ్యలను అరెస్టు చేసారు. గుంటూరు పోలీసు స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారు. అపుడక్కడ జిల్లా పోలీసు అధికారి రొడ్డం ప్రభాకరరావు ఐపిఎస్‌.

ఆయన కొరడా పట్టుకొని స్వయంగా కొడుతూ ‘ఓరోరి అమీనోడా’ పాట పాడుతూ డ్యాన్సు చేయమని జననాట్యమండలి బృందాన్ని అడిగాడని, పాడుతూ, నృత్యం చేస్తుంటే కొరడాతో కొడుతూ సాడిస్టు ఆనందాన్ని పొందాడని విన్నాం. వాళ్లకెవ్వరికీ ఎమర్జెన్సీలో మళ్లీ జైలుకు వెళ్లే దాకా ఆ గాయాలు మానలేదు. రొడ్డం ప్రభాకరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెవి రమణారెడ్డి సహాధ్యాయి. ఆయన వెళ్లి స్వయంగా ఈ దారుణ చిత్రహింసలు చూసి ప్రశ్నించాడు.. ఇపుడీయన కిన్నెర సంస్థకు అధ్యక్షులు. పోలీసు అధికారులకు సాహిత్య సాంస్కృతిక అభిరుచి, అభినివేశం, ప్రవేశం ఉండకూడదని కాదు.

వాళ్ల వర్గ ప్రయోజనాల గురించి కూడ మనం కొంచెం ఏమరపాటుతో ఆలోచించాలనడానికి ఈ వివరాలు. గత వారం రోజులుగా ఈ కిన్నెర సంస్థ భాషా సాహిత్య సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భం కావచ్చు. నవంబర్‌ నెల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సందర్భం కావచ్చు. తెలుగు భాషా సాహిత్య, సంస్కృతుల ఔన్నత్యాన్ని పునరుద్ధరించి కాపాడుకోవాలని కావచ్చు. అంతేనా? అంతమాత్రమేనా? ఈ ఉత్సవాల్లో తమకు ప్రాతినిధ్యం లభించలేదని తెలంగాణ, దళిత, మైనారిటీ రచయితలు కొందరు ప్రదర్శనలు చేసారు.

లోపల ప్రసంగాలు, వేడుకలు జరుగుతుంటే బయట వీరిని పోలీసులు తోసేసారు. అరెస్టు చేసారు. బలప్రయోగం కూడ చేసారు. అభ్యుదయ సాహిత్య వేదిక (70 జూలై 3 సాయంత్రం) దగ్గర నిరసిస్తూ కరపత్రాలు పంచిన విద్యార్థులు నల్లా ఆదిరెడ్డి, తిరుపతి (ఇప్పుడు అమరులు) మొదలైనవారిని కూడ ఆ వేదిక కార్యకర్తలు బంధించి ఒక గదిలో వేసారు. కాని ఆ వేదికలో పాల్గొన్న ఆరుద్ర, గుంటూరు శేషేంద్రశర్మలు అందుకు అభ్యంతరపెట్టి, ఆ విద్యార్థులను వదిలిపెడితేగాని తాము వేదిక ఎక్కమన్నారు.

నిర్వాహకులు ఆ విద్యార్థులను వదిలిపెట్టక తప్పలేదు. ఇప్పుడు ఈ నిరసనలను, బయట ప్రదర్శనలను ఉత్సవాల్లో పాల్గొన్న కొందరు వక్తలు తప్పు పట్టినట్లుగా, అసహనం ప్రదర్శించినట్లుగా చదివినప్పుడు, ఆ వక్తలు విప్లవ సాహిత్యాభిమానులు అని కూడ తెలిసినపుడు కాలం ఎంత మారింది అనిపించింది. ఇంకేమున్నా లేకపోయినా ఈ నిర్వహకులకు తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక ఔన్నత్యాన్ని పునరుద్ధరించి కాపాడుకోవాలనే ఆశయం వెనుక, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షలను, ఉద్యమాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం కూడ ఉన్నదని గ్రహించగలిగితే కనీసం ఒక స్పష్టత ఏర్పడుతుంది. 1969-72లలో ‘అభ్యుదయ’వాదులు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేవాళ్లు. ఇప్పుడు చాప కింది నీటి చందం అయిపోయింది.