స్థానికత-సార్వజనీనత  - వరవరరావుతిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు కరీంనగర్‌ విశ్వవిద్యాలయం శ్రీరాజరాజేశ్వరీ విశ్వ విద్యాలయం ఎందుకుకాకూడదు? సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు?

కరీంనగర్‌లో 1985 నుంచి శాతవాహన స్నాతకోత్తర కళాశాలగా పనిచేస్తున్న ఉన్నత విద్యా సంస్థ, జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలన్న ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానంలో భాగంగా, ఈ నెల 11న విశ్వవిద్యాల యంగా ఆవిర్భవించింది. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని ఇందిరాగాంధీ యూనివర్శిటీగా ప్రభుత్వం ప్రకటించింది. కరీంనగర్‌లో నెలకొల్పుతున్న విశ్వవిద్యాలయాన్ని శాత వాహన విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతులు, రచయితలు, కళాకారులు, సాంస్క­ృ తిక కార్యకర్తలు అందరూ కోరుతున్నారు. ఇదివరలో నల్లగొండ లో నెలకొల్పిన విశ్వవిద్యాలయానికి పోతనపేరు పెట్టాలన్న తెలంగాణ ప్రజల డిమాండును కూడా తోసిపుచ్చి మొదట నల్లగొండ యూనివర్సిటీ అనీ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని దానికి పేరుమార్చారు.

ఇందులో పాలకులకు సంబంధించి రెండు కుట్రలు, రెండు దురుద్దేశ్యాలు ఇమిడి ఉన్నాయి. శాతవాహనులు కోటి లింగాల, ఎలిగందల రాజధానులుగా ఇప్పటి కరీంనగ ర్‌ జిల్లా నుంచి పరిపాలించిన తొలి తెలుగు రాజులని చరిత్ర కారులు రాసిన విషయాన్ని అంగీకరించడానికి ఆంధ్రప్రదేశ్‌ పాలకులు సిద్ధంగా లేరు. ముఖ్యంగా కోటి లింగాల తవ్వకా లలో లభించిన పురాతత్వ ఆధారాల ద్వారా, నాణేల ద్వారా సంగనభట్ల నర్సయ్య, డాక్టర్‌ రాజారెడ్డి ఇటీవల రాస్తున్న విషయాలు పాలకులకు మింగుడు పడడం లేదు. ఆంధ్రప్రదే శ్‌ చరిత్ర కాంగ్రెస్‌ డాక్టర్‌ రాజారెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వా నించి ఆయన ప్రతిపాదనలు అంగీకరించడానికి సిద్ధపడింది గానీ పాలకులకు అది రుచించడం లేదు.

సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడై దక్షిణ దేశానికి మొదట గోదావరి నది నుంచి ఆదిలా బాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనే ప్రవేశించాడని, గుణాఢ్యుని కథా సరిత్సాగరం ఇక్కడే రచించబడిందని చరిత్ర పరిశోధకులు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్‌ పాలకులకు అది చెవి కెక్కడం లేదు. శాతవాహనులు మలి పాలన సాగిన అమరావతి, ఘంట శాలలనే ఇప్పటి పాలకులు శాతవాహనుల పాలనకు గానీ, బౌద్ధ మత ప్రభావానికిగానీ గుర్తించదలచుకున్నారు. కృష్ణా నదీతీరాననే, అది కూడ గుంటూరు జిల్లాలోనేకానీ, గోదా వరి తీరాన అది కూడా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో శాతవాహనుల తొలి పాలనా కాలాన్ని గానీ బౌద్ధమత ప్రచా రాన్నిగాని తొలి పాలనా కాలాన్ని గానీ బౌద్ధమత ప్రచారాన్ని గానీ ఆంధ్రప్రదేశ్‌ పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా రద్దు చేస్తు న్నారు.

ఇది దురుద్దేశ్య పూర్వకమూ, దుర్మార్గమూ అయితే శాతవాహనులు కరీంనగర్‌ నుంచి పాలించిన తొలి తెలుగు రాజులని తెలంగాణ వాసులు చెప్తున్న దానికి పోటీగా ఇంది రాగాంధీ పేరు తేవడం ఒక కుట్ర. ఇందిరాగాంధీ దేశానికి ప్రధానిగా ఉండొచ్చు. పదకొండేళ్ళు దేశాన్ని పాలించవచ్చు. రాజశేఖరరెడ్డికి ప్రాతఃస్మరణీయురాలు కావొచ్చు. తెలంగాణ ప్రజలందరికి ఆమెపట్ల ఒకే రకమైన భావన, గౌరవం ఉన్న దనడానికి వీలులేదు. దళిత, గిరిజనులకు ఆమె ఎంతో మేలు చేసిందన్న భ్రమలు మొదలు శ్రీకాకుళం రైతాంగ పోరాటా న్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నెత్తురుటేర్లలో ముంచి, ఎమర్జెన్సీ ప్రకటించిన చేదు జ్ఞాపకాలు కూడ ఉన్నాయి. ఎమర్జెన్సీ ‘చీకటిరోజులు’ అనుభవాలకు ఈ కరీంనగర్‌ జిల్లాయే కేంద్ర స్థానం. తెలంగాణకు ఆమెకు ప్రత్యేక అనుబంధం ఏమీ లేదు.

ఆమె మెదక్‌ నుంచి ఒకసారి ఎంపి కావచ్చు కాని ఆ మెదక్‌ జిల్లా గిరాయిపల్లి అడవుల్లోనే ఎమర్జెన్సీలోనే నలు గురు విప్లవకారులను చెట్లకు కట్టి కాల్చివేశారు. ఆమె ఎమ ర్జెన్సీ తరువాత ఎన్నికల్లో ఓడిపోతే ఇందిరా కాంగ్రెస్‌ ప్రచా రానికి 1978లో జగిత్యాలకువచ్చి ఉండవచ్చు. ఎమర్జెన్సీలో 20 సూత్రాలు ప్రకటించినందుకు భ్రమలతో పేదలు పడిగా పులు పడి ఆమె బహిరంగ సభను అర్ధరాత్రి విని ఉండవచ్చు. కాని నిజానికి ఆ భ్రమలు తొలగి జగిత్యాల సైతం జైత్రయా త్ర ప్రారంభించి ‘ఊరు మనది వాడ మనది,

దొర ఎందిరో దొర పెత్తనమేందిరో’ అని ప్రకటించి, ‘ఇగ ఎగబడదామురో ఎములాడ రాజన్నా మనం’ అని ‘దొరలకాళ్ల కింద మట్టి దొర లకంట్లో ఎగసి పడింది’ మాత్రం సిరిసిల్ల-జగిత్యాల రైతాంగ పోరాటాలలోనే. ఇందిరాగాంధీ చరిత్రకు కరీంనగర్‌కు సం బంధం అంటూ గింటూ ఏమైనా ఉంటే ఈ భూమిలేని నిరుపేదలు,వ్యవసాయకూలీలు, మాల మాదిగలు నూట యాభై గ్రామాల్లో భూములు స్వాధీనం చేసుకొని తమ హక్కు ప్రకటిస్తే జగిత్యాల-సిరిసిల్లలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి, ఎన్‌కౌంటర్లు చేసి నెత్తురుటేర్లు పారించడంలో ఉన్న ది.

ఈ జగిత్యాల జైత్ర యాత్ర తొలి నాయకుడు సాయిని ప్రభాకర్‌ను ఇదే కరీంనగర్‌ లో పట్టుకుని ఎన్‌కౌంటర్‌ పేరు తో కాల్చివేయటంలో ఉంది. ‘బతుకమ్మ ఆట దొరల గడీలోనే ఎందుకు ఆడాలని’ ప్రశ్నించి ప్రతీకగా నిలిచిన లక్ష్మీరాజం, పోరంబోకు భూములు స్వాధీనం చేసుకొమ్మని పోరు పిలుపునిచ్చిన పోశెట్టిలను చంపేపిన రాజ్యం ఇందిరమ్మ రా జ్యం. ఇవ్వాళ్టికీ వైఎస్‌ఆర్‌ అమలుచేస్తున్న ఇందిరమ్మ రాజ్యం అక్షరాలా ఇదే. తెలంగాణ ప్రజలకు వివాదరహితమైన స్థానిక చరిత్ర, సంస్క­ృతి లేదా? (ఆంధ్ర) చరిత్రకారులు అటువంటి ఆధా రాలు అంగీకరించరా? కాకతీయుల విషయంలో తప్ప ఇంకే విషయంలోను వారికటువంటి ఆమోదం లేనట్లున్నది.

వరంగల్‌లో విశ్వవిద్యాలయానికి కాకతీయ పేరుపెట్టి జిల్లా అంతటా ఎక్కడపడితే అక్కడ కాకతీయ ద్వారాలు పెట్టే విష యంలో తప్ప సుదీర్ఘకాలపు కాకతీయ పాలనలో జరిగిన మరెన్నో ముఖ్యమయిన ప్రత్యామ్నాయ పరిణామాలను ఈ పాలకులు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. పెద్ద మనసుతో వరంగల్‌ జిల్లా ప్రజలు ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో ఉన్న పాలకుర్తి, బమ్మెర, కడవెండి వంటి సుప్రసిద్ధ చారిత్రిక స్థలా లను ఒకప్పటి జనగామ తాలూకా, నల్లగొండ జిల్లాకు చెంది న వాస్తవాన్ని గుర్తించి నల్లగొండ విశ్వవిద్యాలయానికి పోత న పేరు పెట్టాలని డిమాండ్‌ చేసినా పాలకుల పెడచెవిన పెట్టారు.

అందులో ఉన్న అల్పబుద్ధి ఏమిటో, వాళ్ల మనసు లో ఏ మాలిన్యం ఉన్నదో కడప ద్విశతాబ్ది ఉత్సవాల్లో బయ టపడింది కనుక ఆ వివరాలు మళ్లీ రాయను. తాత్కాలిక అధికారానికి ముడిపెట్టి సాహిత్య, సాంస్క­ృతిక చరిత్రరచన సాగకూడదని మాత్రం చెప్పదలచుకున్నాను. శాతవాహను లు తెలుగువాళ్ళందరి రాజులు. ఆ మాటకొస్తే సుదీర్ఘకాలం సువిశాలమైన తెలుగునేలనే కాదు దక్షిణ దేశాన్ని, సముద్రం దాటి ఇతర దేశాలను పాలించిన రాజులు. బౌద్ధమతాన్ని పోషించిన వాళ్లు. కళలు, శిల్పం పరిఢవిల్లిన కాలం. గాథాస ప్తశతి, కథాసరిత్సాగరం వంటి అద్భుతమైన సాహిత్యం వచ్చిన కాలం. ప్రాకృతం పలికిన కాలం. అయితేవాళ్లు మొద ట ఇప్పటి కరీంనగర్‌ ప్రాంత గోదావరి తీరాన తమపాలన సాగించారు.

కాకతీయులు కూడ ఇప్పటికన్న సువిశాలమైన తెలుగునేలను ఏలిన వాళ్ళు. కాని వాళ్ల రాజధాని మాత్రం తెలంగాణలోని వరంగల్‌లో ఉన్నది. ఈ తెలంగాణలోనే అప్పటి నల్లగొండ, ఇప్పటి వరంగల్‌లోని సోమనాధుని పాలకుర్తి (ఐలమ్మ పాలకుర్తికూడా) పోతన బమ్మెర ఉన్నా యి. ఇవి అంగీకరించడానికి, చరిత్రతేల్చిన సత్యాలు అంగీక రించడానికి బాధ ఎందుకు? పి.వి.నరసింహారావు అధికారం లో ఉంటే పోతన బమ్మెర తెలంగాణలో, వైఎస్‌ అధికారం లో ఉంటే పోతన ఒంటిమిట్ట కడపలో ఉంటుందా? తెలుగు ప్రజల జాతీయ కవి వేమన తెలంగాణ వాడు ముఖ్యమంత్రై నా లేదా దేశ ప్రధాని అయినా కడప వాడే అవుతాడు.

మాకు అభ్యంతరం లేదు. మా అభ్యంతరమల్లా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి విశ్వవిద్యాల యం పెట్టినప్పుడు కరీంనగర్‌ విశ్వవిద్యాలయం శ్రీరాజరాజేశ్వరీ విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు? సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం ఎందుకు కాకూడదు? కడపలో విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం అయినప్పుడు కరీంనగర్‌ విశ్వవిద్యాలయం వేములవాడ భీమకవి విశ్వవిద్యాలయం ఎందుకుకాకూడదు? రాజమండ్రిలో విశ్వవిద్యాలయానికి నన్నయ పేరుపెట్టినప్పుడు నల్లగొండ విశ్వవిద్యాలయానికి పోతన పేరో, సోమనాథుని పేరో ఎందుకు పెట్టకూడదు? పెట్టకపోగా పోటీగా మహా త్మా గాంధీ పేరు తెస్తారు.

గాంధీపేరుపెడితే నోళ్లు మూయించవచ్చునని. గాంధీజీ ప్రభావం నైజాం వ్యతిరేక పోరాటంలో లేదని కాదు. గాంధీజీ కన్నా నల్లగొండ ప్రజల మీదున్న ప్రభావం ఆంధ్రమహాసభది, సంగానిది. కమ్యూ నిస్టు పార్టీది. పాలకుర్తి ఐలమ్మ, మొండ్రాయి లంబాడీలు, కడవెండి దొడ్డికొమురయ్య, ఆ తర్వాత కాలంలో నల్ల నర్సిం హులు వర్తమాన చరిత్రలో ఎర్రంరెడ్డి సంతోష రెడ్డి, ఆంధ్ర మహాసభ, స్టేట్‌ కాంగ్రెస్‌ కాలంనుంచి, కమ్యూనిస్టుపార్టీ కాలంనుంచి 1952 బోనగిరి దాక రావినారాయణరెడ్డి, బాలెంల సూర్యాపేట పోరాటాలు, గొల్ల ఎలమంద, బంద గీ, దేవులపల్లి వెంటేశ్వరరావు మొదలయిన వారు నల్లగొండ కున్న స్థానిక చరిత్రలో ఉన్న విశ్వసనీయత వల్లనే అది ఒక ప్రత్యామ్నయ పోరాట మార్గమయింది.

నన్నయ, వేమనల స్థానికత ఒక సార్వజనీనతకు ఆటంకంకానప్పుడు శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి స్థానికత ఒక సార్వజనీనతకు అడ్డంరానపుడు ఒక పోతన, ఒక సోమనాధుడు, ఒక వేములవాడ భీమకవుల స్థానికత ఎందుకు పాలకుల గొంతుకు అడ్డం పడుతున్నది? ఎందుకు మేడారం సమ్మక్క,సారలక్కగుర్తుకు రావడం లేదు. తెలంగాణలోని స్థానికతలో సంకుచితత్వం కనిపించి, ప్రాంతీయ భావన కనిపించి, ఆంధ్రలోని స్థానికతలోనే సార్వజనీనత, సమైక్యత కనిపిస్తున్నాయా? పోనీ, కాసేపు మీకున్న విశాల భావన వంటి భావనతోనే మీ కడప వాడయిన పోతన పేరుతో మా నల్లగొండ విశ్వవిద్యాలయానికి పోతన పేరుపెట్టమని అడుగుతున్నామనుకోండి. మీ అమరావతే, ఘంటశాల ప్రాంతంలో రాజధాని చేసుకొని పాలించిన శాతవాహనుల పేరుతోనే కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయం అని పేరు పెట్టామని అడిగామనుకోండి. అప్పుడు మీ పోతన మా పోతన అయి మన పోతన అవుతాడు గదా.

మీ శాతవాహనులు మా శాతవాహనులు కూడా అయి మన శాతవాహనులు అవుతారు గదా. ఇది వేర్పాటు వాదమవుతుందా? సమైక్యభావనవుతుందా? కన్నడ రాజయిన శ్రీకృష్ణ దేవరాయలు సువిశాల తెలుగు ప్రాంతాన్ని పాలించినందుకు, హంపీ విజయనగరం వాడయినా సరే మీరు అనంతపురంలో విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకున్నారు. అనంతపురం ఎన్నడూ విజయనగర రాజుల రాజధాని కాదు. ఆ మాటకొస్తే రాయలసీమలో ఏ ఊరూ వాళ్ళ రాజధాని కాదు. అనంతపురంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పడడానికి అభ్యంతరం ఏమిటి?నిజానికి విశ్వవిద్యాలయాలకు పేర్లు పెట్టడంలో వచ్చేదీలేదు. పోయేదీలేదు. మరి ఈ చర్చ ఎందుకంటే స్వభావాలను అర్థం చేసుకోవడానికి, ఆధిపత్య భావజాలాన్ని పసిగట్టడానికి, సాహిత్య, సాంస్క­ృతిక వివక్షను విప్పిచెప్పడానికి. దుస్సాహసమనిపించవచ్చు గానీ ఆంధ్రప్రదేశ్‌ అనే హిందే పేరు స్థానంలో ఇప్పుడున్న ఇరవై మూడు జిల్లా రాష్ట్రానికి పాలకులు తెలంగాణ అనే తెలుగు పేరు అమోదిస్తారా అని అడిగివున్నాను.