‘అవును! రాజమౌళిని పట్టుకుని చంపారు’
‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటా’ అని హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ లో ఒక సామెత ఉండేది. దొంగతనంచేసిన వాడే పోలీసధికారిని నిందించాడు అని అర్థం. దొంగే ముందు దొంగ దొంగ అని అరిచా డని తెలుగులో చెప్పుకొనేదానికన్నా ఆసక్తిదాయకమైన సామెత ఇది. కానీ ఇవ్వాళ్టి సందర్భంలో ‘పోలీసే ప్రజాస్వామిక హక్కు అడిగిన వాణ్ణి నేరస్తుడన్నాడని’, ‘హంతకుడే హత్య అన్నవాడిపై నేరారోపణ చేశాడ’ని చెప్పుకోవచ్చు. ‘నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్నిచేసి వేటాడుతున్న వ్యవస్థ’ ఇది. చూస్తూ నోరుండి ఊరుకోలేకపోయినందుకు నేరారోపణ! సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ అలియాస్ కృష్ణది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆయన అంత్యక్రియల్లో పాల్గొని, గూడెం (హతుని స్వగ్రా మం)లో మాట్లాడినందుకు పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, ఆంతరంగిక భద్రతాచట్టంకింద నన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయిందని పత్రికలు రాసినప్పుడు నాకా ఉర్దూ సామెతే గుర్తుకొ చ్చింది.
గూడెంలో ఏమొచ్చె నేను హైదరాబాదులోనే గత నెల 23న రాజ మౌళిది బూటకపు ఎన్‌కౌంటర్ అన్నాను. ఆ ఎన్‌కౌంటర్‌కు బాధ్యులయిన పోలీసధికారులపై హత్యానేరం (కల్పబుల్ హోమోసైజ్) కింద కేసు నమోదు చేయాలన్నాను. అప్పటికి, అంత్యక్రియల్లో గూడెంలో పాల్గొన్న ప్పటికి నేనుచేసినవి ఆరోపణలే. అప్పటికి తెలిసిన సమాచారం ఆధా రంగా చేసిన ఆరోపణలు. రైల్వే స్టేషన్‌లో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎన్‌కౌంటర్ అయితే ఇరు వైపుల ఇతరులకెవరికి చిన్న గాయిలయినా కాకుండా వెంట ఉన్న ఇద్దరు తప్పించుకోవడమో, పోలీసుల చేతికి చిక్క డమో సాధ్యమైప్పుడు ఒక్క రాజమౌళియే ఎన్‌కౌంటర్ కావడం ఏమిటి అని మాత్రమే అప్పుడు ప్రశ్నించాను. రాజమౌళి రైల్లో ప్రయాణం చేస్తూన్నా, నగరాల్లో ఉన్నా నిరాయుధంగానే ఉండి వుంటాడు గనుక ఆయన కాల్చి ఉండడని ఊహించాను.
పోలీసులు ఆయన గుండెలకు గురిచేసి కాల్చినట్లు ఛాతీలోంచి బుల్లెట్ పోయిన గుర్తులు, చేతిలోంచి బుల్లెట్ పోయిన గుర్తులు ఉన్నాయి గనుక స్టేషన్ బయటకి పరుగెత్తుతూ పుట్టపర్తి బస్సు వెనుక నుంచి తప్పించుకుంటూ కాల్చాడనడానికి ఆధా రం లేదన్నాను. నిరాయుధంగా నిలబెట్టి కాల్చినట్లుగా ఉందేతప్ప కాలు స్తూ తప్పించుకున్న వాణ్ణి కాల్చినట్లు లేదని మృతదేహాన్ని బట్టి చూసిన వాళ్ళు ఊహించారు. నేనూ అదే మీడియాకు చెప్పాను. ఏమయినా మృత దేహాన్ని చూసి ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వార్తలు చూసి, చదివి 24 వ తేదీనాటికి పరిసరాలు, పరిస్థితులు గత చరిత్రను బట్టి ఊహించి చెప్పిందే తప్ప, పౌరులకుండే ఆరోపణచేసే హక్కును వినియోగించుకొని ప్రభుత్వా నికుండే పారదర్శక బాధ్యతను గుర్తుచేయడమే తప్ప అప్పటికి అంత కన్నా ఎక్కువేమీ కాదు.
అయితే రాజమౌళిది బూటకపు ఎన్‌కౌంటర్ అనే విషయం అప్పటికే అందరూ ఊహిస్తున్నది, అనుకుంటూన్నది. దానిని కాదంటున్న డిజిపికి కూడా అది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఊహిస్తున్న వాళ్ళ కన్నా, అనుకుంటున్న వాళ్లకన్నా ఎంతో స్పష్టంగా తెలుసు. అంత కాన్న ఎస్‌ఐబి వాళ్లకు, వాళ్ల పర్యవేక్షణలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనం తపురం పోలీసులకు, గ్రేహౌండ్స్‌కు మరిన్ని వివరాలు ప్రామాణికంగా తెలుసు. అవి సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో వలే వెలుగు చూడాల్సివు న్నది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, రాజమౌళిని కేరళలోని కొల్లాంలో అరెస్ట్ చేశారని ఇప్పుడు స్పష్టమైన సమాచారం మీడియా ద్వారా యావ ద్దేశానికీ తెలిసింది. ఆయన జూన్ 21వ తేదీ మధ్యాహ్నం కొల్లాం రైల్వే స్టేషన్ బస్ స్టాప్ దగ్గర 04742-765303 ఫోన్ నంబర్ నుంచి కర్ణాట కకు (బహుశా బెంగుళూరుకు ఆఖరు సారిగా ఫోన్ చేసినప్పుడు మధ్య లో డిస్ కనెక్ట్ అయిందని, అటువైపు వారికి ‘ఎహ్’ అని శబ్దం వినవచ్చిం దని మీడియాలో స్పష్టంగా వచ్చింది.
అంతకుముందు 20వ తేదీ ఆయన కర్ణాటక నుంచి బహుశా బెంగుళూరు నుంచి కొల్లాం బయల్దేరి వెళ్లాడు. అక్కడినుంచి కచ్చితమైన సమాచారం ద్వారా ఆంధ్ర ఎస్‌ఐబి వాళ్లు ఆయ నను అనుసరించి ఉంటారు. ఆయన కొల్లాం నుంచి ఆఖరుసారి మాట్లా డింది ఆయన సహచరి సుజాత కావచ్చు లేదా మరెవరైనా పార్టీ కామ్రేడ్ కావచ్చు. వీటి ఆధారంగా పోలీసులు సహజంగానే సమాచారం అందజే సినవారు లేదా సమాచారానికి బాధ్యులయిన వాళ్లు ఎవరయివుంటారనే విషయంలో దుష్ప్రచారానికి ఎన్ని ఎత్తుగడలయినా వేయవచ్చు. ఏ సమాచారమయినా ఉద్దేశపూర్వకంగా ప్రచారంలో పెట్టవచ్చు. సహచరి యే సమాచారమిచ్చిందా అనే సందేహాలను, కర్ణాటక పార్టీలోని విభేదాలే సమాచారానికి కారణమా అనే ఊహాగానాలకు ఉద్దేశపూర్వకంగా తావి చ్చి గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలనూ చేయవచ్చు. కానీ ఏద యినా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ మాత్రం కాకుండా పోదు.
ఎవరో ఇచ్చి న సమాచారం ఆధారం లేకుండా, కర్ణాటకనుంచే ఆయనను వెంబడిం చకుండా ఆయనను కొల్లాంలో అదుపులోకి తీసుకోవడం ఎట్లా అసాధ్య మో అదే కారణంగా అది నిజమయిన ఎన్‌కౌంటర్ కావడం కూడా అంతే అబద్ధం. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ప్రయాణంచేస్తున్న సొహ్రబుద్దీన్‌ను , ఆయన భార్య కౌసర్‌బీ, స్నేహితుణ్ణి గుజరాత్ పోలీసులు, ఆంధ్రా పోలీ సులు ఇచ్చిన సమాచారంతో అరెస్టుచేసి ఎన్‌కౌంటర్ చేశారు. కౌసర్ బీ తమ్ముడు వేసిన పిటిషన్ ఆధారంగా, ఇందులో ప్రమేయముంటుందని భావించిన గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రా పోలీసుల విషయంలో ఐజి గీతా జోహ్రీని విచారించవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. గుజ రాత్, రాజస్థాన్‌లనుంచి బాధ్యులని ఆరోపణలున్న పోలీసు అధికారులను అరెస్టుచేసి సస్పెండ్ చేసి విచారణ కూడా చేస్తున్నారు. గీతా జొహ్రీ హైద రాబాద్‌కూడా వచ్చి ఏపి పోలీసధికారులను, సంబంధం ఉండవచ్చునని ఆరోపణలు ఉన్న పోలీసధికారులను కూడా విచారించి వెళ్లింది.
బహుశా ఆమె సుప్రీంకోర్టుకు తన నివేదిక కూడా అందించి ఉంటుంది. సంబంధం ఉండవచ్చని ఆరోపణ ఉన్న ఐపిఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి గ్రేహౌండ్స్ పదవికి బదిలీచేసింది. దీనితో పూర్తిగా పోలిక ఉన్న సందె రాజమౌళి ఎన్‌కౌంటర్ విషయంలో ఇదివరకు కరీంనగర్‌లో, అనంతపురంలో పనిచేసి ఇప్పుడు గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న ఐపిఎస్ అధికారి, ఎస్‌ఐబి వారిని, అనంతపురం పోలీసులకు సహకరించాడని, జూన్ 19వ తేదీన ఎస్‌ఐబి ఉన్నతాధికారి ఒకాయన అనంతపురం కూడా వెళ్లి వచ్చాడని, అనంతపురం ఎస్‌పికి ఇదివరకు ఉత్తర తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేసిన అపార అనుభవం ఉందని, ఆయన స్వయం గాగుజరాత్ ఎన్‌కౌంటర్ నిపుణుడు వంజేరాతో పోల్చతగిన ఐపిఎస్ అధి కారి అని కథనాలు, ప్రకటనలు మీడియాలో వస్తూనేవున్నాయి. కనుక సందె రాజమౌళి విషయంలో మొదట ఎస్‌ఐబి ఉన్నతాధికారులు, గ్రే హౌండ్స్‌లో ఉన్న ఐపిఎస్ అ«ధికారి, అనంతపురంలో పోలీసధికారులు, ముఖ్యంగా ఎస్‌పి, వీరందరికీ నాయకత్వం వహిస్తున్న డిజిపిలపై నేరా రోపణచేయవలసివున్నది.
రాష్ట్రాల ఎల్లలు కూడా దాటి కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వెళ్లి అక్రమ అరెస్టులు చేసి ‘ఎన్‌కౌంటర్’ చేసినట్లు నేరారోపణ చేయవలసివున్నది. ఈ క్రియలో కర్ణాటక, కేరళ పోలీసుల సహకారం తీసుకొనివుంటే, అది పోలీసుల, ప్రభుత్వ దృష్టిలో సమన్వయం కావచ్చు కాని చట్టం దృష్టిలో సొహ్రబుద్దీన్ కేసులో వలే నేరానికి దోహదం చేయ డంగనుక ఇంకా పోలీసుల అదుపులో ఉన్న మరో ఇద్దరు, కౌసర్ బీ, తుల సీరామ్‌ల వలే ‘ఎన్‌కౌంటర్’ కాకముందే జరగాలి. సందె రాజమౌళిది బూటకపు ఎన్‌కౌంటర్ అనడం నేరమయితే మళ్లీ ఒక మారు ఆ మాట నా స్వదస్తూరీతో రాసి అనదలుచుకున్నాను. 1969 మే 27 నాటినుంచీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ నేరా లు చేస్తున్నారు. ఆనాటినుంచి ఎపిసిఎల్‌సి, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు, విరసం ఆ ఎన్ కౌంటర్లన్నీ 99 శాతం పోలీసు హత్య లే, విధానపరంగా ప్రభుత్వ హత్యలే అని ఆరోపిస్తూనే ఉన్నది.
ఆ ప్రజా స్వామ్య సంప్రదాయంలో భాగంగానే నేను గత 38 సంవత్సరాలుగా బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తున్నాను. రాజమౌళి బూటకపు ఎన్‌కౌం టర్ ఇందులో మొదటిదీ కాదు, ఆఖరదవుతుందనే భ్రమ కూడా నాకు లేదు. బూటకపు ఎన్‌కౌంటర్ అన్నందుకు ప్రజా భద్రత చట్టం కింద కేసు పెట్టడం మాత్రం నా అనుభవంలో ఇది మొదటిది! గూడెంలో రాజమౌళి అంత్యక్రియల రోజు పోలీసులు మఫ్టీలోను, యూనిఫారాల్లోను ఊళ్లోకి వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి , పొరుగు గ్రామాల వారిని ఊళ్ళోకి రానివ్వద్దని, ఊళ్లో వాళ్ళను ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరిం చారు. ఊళ్ళోకి జమ్మికుంట వైపునుంచి ప్రవేశించే గుంపులు గ్రామం దగ్గర మానేరు వంతెన వద్ద వందల సంఖ్యలో పోలీసులను మొహ రించారు. నడిచిగానీ, సైకిల్ వంటి ద్విచక్ర వాహనాల మీదగానీ ఎవరినీ అనుమతించలేదు.
ఈ విషయాన్ని నేను హోం మంత్రి దృష్టికి తెస్తూ కాశ్మీ రులో వంతెనల దగ్గర మిలిటరీ కాపు కాచినట్లుగా ఇట్లా పోలీసులను మొహరించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వెనక్కి తిప్పి పంపడం పోలీ సుల తెలివితేటలకు నిదర్శనం కావచ్చుకానీ ప్రజాస్వామ్యానికి నిదర్శనం మాత్రం కాజాలదన్నాను. బూటకపు ఎన్‌కౌంటర్లకు బా«ధ్యులైన వారిమీద కాకుండా బూటకపు ఎన్‌కౌంటర్ అన్నవారిమీద నేరారోపణ చేయడం కూడా ఆంధ్రా పోలీసుల ప్రత్యేత. బహుశా ఆ విధాన నిర్ణయం తీసు కున్న ప్రభుత్వ అతి తెలివికి, అతి జాగ్రత్తకు, అతి భయానికి నిదర్శనం కావచ్చు కానీ పారదర్శకతకు, ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం కాదు. ఇంత జరిగినా ప్రశాంతంగా నిద్రోబోతున్నట్లున్న సందె రాజమౌళి మొహాన్ని, ఆయనను ఆఖరుసారి చూడడానికి వచ్చిన వేలాది ప్రజలను చూసి విప్లవాన్ని బూటకంగా తప్ప ఎన్‌కౌంటర్ చేయలేమని ప్రభుత్వం మళ్లీ ఒకసారి గ్రహించి ఉంటుంది.
Saturday 07 Jul 2007 | వరవరరావు | తెలుగు, AndhraJyothy