రాజమౌళి అంత్యక్రియల్లో వరవరరావు ధ్వజం

Varavara Raoపెద్దపల్లి, న్యూస్‌టుడే: ప్రజల కోసం అజ్ఞాతంలో ఉంటున్న మావోయిస్టులను ప్రభుత్వం దొంగచాటుగా పట్టుకొచ్చి కాలుస్తోందని విరసం నేత పెండ్యాల వరవరరావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం గూడెంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ అంత్యక్రియలకు వరవరరావు హాజరయ్యారు. ప్రజలకు సేవలు అందించలేని ప్రభుత్వం మావోయిస్టు పెద్ద తలలకు వెల కడుతోందన్నారు. మావోయిస్టులను చంపుతున్న కాంగ్రెస్‌ను ప్రజలే కూలుస్తారని అన్నారు. విప్లవ ద్రోహులు అందించిన సమాచారంతో అనంతపురం ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర గూడెం ప్రసాద్‌ను కాల్చి చంపించారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో 25 ఏళ్లుగా కృష్ణ పేరుతో, తెలంగాణ ప్రాంతంలో ప్రసాద్‌గా సేవలందించిన గూడెం ముద్దుబిడ్డ సందె రాజమౌళిని ప్రభుత్వమే బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య చేసిందని విరుచుకుపడ్డారు. ‘మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలు, హైకోర్టు సూచనల మేరకు కుటుంబ సభ్యులు, న్యాయమూర్తి, ఇద్దరు ఫొరెన్సిక్‌ నిపుణులు, వైద్యుల సమక్షంలో వీడియో చిత్రీకరణ నిర్వహించాలి. హైదరాబాద్‌ నుంచి రాజమౌళి మృతదేహం కోసం బంధువులు వస్తున్నారని తెలిసిన వెంటనే అర్హతలేని ఇద్దరు వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించడం చట్టపరంగా చెల్లదు. హోంమంత్రి, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు, తహసీల్దార్‌కు ఫోన్‌ చేసినా వారు వినిపించుకోక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ బయట పడుతుందనే ఉద్దేశంతో ఇదంతా చేశారు’ అని విమర్శించారు.

అశ్రు నయనాలతో రాజమౌళికి అంత్యక్రియలు: రాజమౌళి అంత్యక్రియలు ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామం ఓదెల మండలం గూడెంలో నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. 25 ఏళ్ల క్రితం గ్రామాన్ని విడిచి ఉద్యమం బాట పట్టిన రాజమౌళిని చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడుగడుగునా బందోబస్తుతో అడ్డుకున్నారు.

విప్లవాన్ని అణచేందుకు సర్కారు కుట్ర: బూటకపు ఎన్‌కౌంటర్లతో రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చి, విప్లవాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ(ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి వర్గం ధ్వజమెత్తింది. ప్రజా ఉద్యమాలను నీరుగార్చడానికి ప్రజలపై, విప్లవకారులపై సర్కారు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని ఆ వర్గం రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌ ఆదివారం దుయ్యబట్టారు. వరంగల్‌ జిల్లా మల్లంపల్లి గ్రామం వద్ద తమ పార్టీ నేత గణేష్‌, కొరియర్‌ రెడ్యానాయక్‌, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజమౌళి ఎన్‌కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు.