గుజరాత్ సరే, ఇక్కడి ‘ ఎన్కౌంటర్ల’ మాటేమిటి?
సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్‌బీ (గుజరాత్ పోలీసులచే ఎన్‌కౌంటర్ హత్యకు గురయిన భార్యాభర్తలు)ల ఉదంతం అనివార్యంగా ఒక ప్రశ్నకు తావిస్తుంది: ‘మన రాష్ట్రంలో అటువంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉన్నప్పటికీ కనీసం ఎస్.ఐ. స్థాయి పోలీసు అధికారి అయినా ఎన్నడైనా నేరారోపణ నెదుర్కొన్నాడా?’ (ప్రస్తావిత గుజరాత్ ఎన్‌కౌంటర్ ముగ్గురు ఐపిఎస్ అధికారుల - ఇద్దరు గుజరాత్, మరొకరు రాజస్థాన్ కేడర్‌కు చెందిన వారు- సస్పెన్షన్, అరెస్ట్‌కు దారితీసింది). సొహ్రబుద్దీన్, కౌసర్‌బీల ఎన్‌కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకూ ప్రమేయం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇక్కడి పోలీసధికారులు తక్షణమే ఆ వార్తలను ఖండించడమే కాక పరువు నష్టం దావా దాఖలు చేస్తామన్నంత దూరం పోయారు.
ఏమైనా మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు, సుప్రీంకోర్టు అయినా, పోలీసధికారుల నేర ప్రవర్తనకు శిక్ష విధిస్తుందా అనేది అనుమానమే. నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేసినందుకు పదోన్నతులు పొందుతున్నారు మన పోలీసధికారులు. ఈ విధానం సేవా నియమాలకు విరుద్ధమని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో పోలీసధికారులు హత్యలకు పాల్పడితే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పదోన్నతులు కల్పించడం సబబేనని అత్యున్నత న్యాయస్థానం భావించింది. జస్టిస్ భార్గవ నుంచి జస్టిస్ రంగనాథ మిశ్రా వరకు మన రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లపై జరిపిన న్యాయవిచారణలో సంచలనాత్మకమైన సత్యాలు వెల్లడయ్యాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం తార్కుండే కమిటీ కృషి పలితంగా జస్టిస్ భార్గవ కమిషన్ ముందు ఐపిస్ అధికారులు బోనులో నిలబడ వలసివచ్చింది. దీంతో ప్రభుత్వం ఇన్ కెమెరా విచారణకు ఆదేశించింది.
గిరాయిపల్లి ఎన్‌కౌంటర్ (1975 జులై)లో నలుగురి మృతి విషయంలో సాక్ష్యాధారాలు, ప్రత్యక్షి సాక్షి కథనం వల్ల అవి పోలీసు హత్యలేనని జస్టిస్ భార్గవ భావించారు. అంతకుమించి ఆయనేమీ చేయలేకపోయారు. ఎపిసిఎల్‌సి సమర్పించిన బూటకపు ఎన్‌కౌంటర్‌ల జాబితాపై జస్టిస్ రంగనాథ మిశ్రా బహిరంగ విచారణ జరిపి ఐపిఎస్ అధి కారులను తప్పుపట్టారు. కనీసం ఐదు ఎన్‌కౌంటర్ల విషయంలో ప్రాథమిక నేరారోపణకు అవకాశం ఉందన్నారు. అయినా ప్రభుత్వం ఏ చర్యా చేపట్టలేదు. 1985-89 మధ్య కాలంలో జరిగిన 70 మిస్సింగ్ కేసులను విచారించిన జస్టిస్ టిఎల్‌ఎన్ రెడ్డి కనీసం ఏడుగురు (వీరిలో ఇరువురు ఐపి ఎస్‌లు) పోలీసధికారులు మిస్సింగ్ మరణాలకు బాధ్యులని అభిప్రాయపడ్డారు. నేరారోపణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇద్దరు పోలీసధికారులపై నక్సలైట్లు ప్రతీకారం తీర్చుకున్నారు. మిగతా వారంతా పదోన్నతులు పొందారు.
ఇవన్నీ న్యాయవిచారణ కమిషన్‌లు అనుకుంటే కనీసం రెండు ఎన్‌కౌంటర్ హత్య కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవి హత్యా నేరాలుగా నమోదు కావాలని తీర్పు ఇచ్చింది. అవి మధుసూదన్‌రాజ్, రెండోది మాదిరెడ్డి సమ్మిరెడ్డి (రమాకాంత్) ఎన్‌కౌంటర్ కేసులు. మధుసూదన్‌రాజ్ ఎన్‌కౌంటర్ విషయంలో నైతే చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టుకూడా ఆమోదించింది. అయినా ఏ చర్యా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు ఒక ప్రభుత్వ విధానంగా 1969 మే 27న ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం లో నక్సలైటు ఉద్యమాన్ని ప్రారంభించిన పంచాది కృష్ణమూర్తి, అతని ఐదుగురు సహచరులను సోంపేట రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి అప్పటి హోం మంత్రి జలగం వెంగళరావు వైర్‌లెస్ ఆదేశాలతో ఎన్‌కౌంటర్ చేయడంతో ఆరంభమయ్యాయి. కాంగ్రెస్ సర్కారైనా, తెలుగు దేశం ప్రభుత్వమైనా ముఖ్యమంత్రులు మారినా నక్సలైట్ల విషయంలో ఎన్‌కౌంటర్ హత్యా విధానం ఆగలేదు.
కాకపోతే ఆయా కాలాల్లో- ఎన్టీఆర్ హయాంలో మిస్సింగ్ హత్యలు, చంద్రబాబు నాయుడి పాలనలో ‘కోవర్టు హత్యలు’, వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ప్రజా సంఘాలవారిని కూడా ‘ఎన్‌కౌంటర్’ చేయడం తోడయినాయి. వ్యాస్ హయాంలో ‘గ్రేహౌండ్స్’ పేరిట ఒక చట్ట వ్యతిరేక పోలీసు వ్యవస్థకు రూపకల్పన జరిగితే, దొర హయాంలో ‘కోవర్టు హత్య’లకు రూపకల్పన జరిగింది. ఇక కె.అరవిందరావు అయితే నక్సలైట్ వ్యతిరేక సిద్ధాంతకర్త. ఈయన నక్సలైట్ ఉద్యమాన్ని దండకారణ్యం లో రామాయణ కాలంలో యజ్ఞాలను భగ్నం చేసి రాక్షసుల చర్యగా పోల్చుతూ, దానిని అణచివేయడం ఒక రామధర్మంగా, రాజ్యధర్మంగా సిద్ధాంతీకరించాడు. వివిధ కాలాల్లో కీలక పదవుల్లో ఉంటూ ఈ అధికారులు రూపొందించిన ఎన్‌కౌంటర్ హత్యా విధానాలకు ముఖ్యంగా జలగం వెంగళరావు, రామారావు, నేదురుమల్లి జనార్దనరెడ్డి, చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలు పూర్తి అండదండలిచ్చాయి.
నక్సలైట్ పార్టీలు, ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల ఎజెండాలో మొదటి అంశం పౌర హక్కులు -చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలనకు కట్టుబడివుంటామని, బూటకపు ఎన్‌కౌంటర్లు జరగవని ప్రభుత్వం చెప్పింది. ఆ తరువాతే మానాల ఎన్‌కౌంటర్ జరిగింది. శాంతిచర్చల్లో నక్సలైట్ ప్రతినిధి అయిన రియాజ్‌తో పాటు ఆయన సహచరులను అరెస్ట్ చేసి ఎన్‌కౌంటర్ చేశారు. ప్రత్యేకించి మానాల ప్రస్తావన ఎందుకంటే అది ఎన్‌కౌంటర్ కాదని, కోవర్టు ద్వారా విషాహారం ఇచ్చి చంపారని, కనుక ఎన్‌కౌంటర్లను హత్యా నేరాలుగా నమోదు చేయాలన్న మౌలిక డిమాండ్‌పై హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం విచారణ చేసింది. తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది. ఈలోగా ఎన్‌కౌంటర్లకు బాధ్యులైన పోలీసధికారులకు ప్రోత్సాహక పదోన్నతులు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సరే, సుప్రీంకోర్టు ఇప్పుడు గుజరాత్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసు విచారణను చేపట్టింది.
న్యాయం జరగుతుందని అనిపించేలా విశాఖపట్నం రూరల్ ఎస్‌పి మురళిని ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగివున్నారని, రౌడీషీటర్లతో, ల్యాండ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నాడని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక ఐపిఎస్ అధికారి అరెస్టయ్యాడు-అవినీతి ఆరోపణపై. అవినీతి నేరం కాదా అంటే సివిల్ నేరం అవుతుందేమో కాని క్రిమినల్ నేరంకాదు. అయితే ఎన్‌కౌంటర్లకు బాధ్యులైన పోలీస్ అధికారులకు పదోన్నతులు, పోలీస్ స్టేషన్‌లకు పారితోషికాలు ఇచ్చే పద్ధతి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధమైన అవినీతిని, హత్యా నేరాన్ని కూడా ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న ఏ పోలీస్ అధికారి బీరువా తెరిచినా అపరిమిత ఆస్తులేకాదు, అసంఖ్యాక కంకాళాలు కూడా బయటపడతాయి. ప్రైవేట్ ఆస్తిని కాపాడే వ్యవస్థలో నెత్తురంటని ఆదాయాన్ని మించిన ఆస్తి ఉంటుందనుకోవడం అమాయకత్వం -ముఖ్యంగా ఆ నెత్తురు వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళదై ఉంటుంది.
Friday 11 May 2007 | వరవరరావు | వ్యాసాలు