శ్రీరమణ రచన ఎక్కడ దొరికినా చదవడం నాకిష్టం. ఆయన చాల సీరియస్ విషయాలను చాల సరదాగా రాస్తారు. అలవోకగా చెప్తారు. శ్రీకాలమ్‌లో ఆయన వైఎస్ఆర్‌ను చురకలు పెడుతూ రాసినా, చంద్రబాబును హాస్యం చేసినా వాళ్లకెట్లా ఉంటుందో గానీ నాకు సరదాగానే ఉండేది. పత్రికలవాళ్లు అధికారంలో ఉన్న పవర్‌ఫుల్ వ్యక్తులను కొంచెం నొప్పిస్తూ రాసినా ఆమాత్రం గిల్లడం అవసరమే. ఆ లెక్కన ఇవ్వాళ పవర్ రుచి చూసి రేపు ఇంకా పవర్‌ఫుల్ కావడానికి అవకాశం వున్న కెసిఆర్ నరేంద్రలను శ్రీ రమణ ఎద్దేవా చేయడం కూడా సరదాగానే ఉంటుంది. కాని ఎందుకో ఈసారి (8వ తేదీనాటి ‘శ్రీకాలమ్’లో) ఆయన కెసిఆర్‌ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ కోరుకొంటున్న వారిని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఈ క్రమంలో ఆయన కొన్ని అసంబద్ధమైన సిద్ధాంతాలు, సూత్రీకరణలు కూడా చేశారు. సరదారచనల్లో సాధారణంగా సీరియస్ సూత్రీకరణలు ఉండవు. అసలు ఎందుకో సూత్రీకరణలతో ప్రారంభించి సీరియస్‌గానే వెక్కిరించారు శ్రీరమణ.

ఉదాహరణకు నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో భూమి మొత్తం ఒక విశాలమైన గ్రామంగా మారిందన్నారు. ప్రపంచీకరణ వల్ల కుగ్రామాలు కూడ ప్రపంచ మార్కెట్ పటంలోకి వచ్చాయేమోగానీ ప్రపంచీకరణ తర్వాతనే కదా సోవియట్ యూనియన్‌లోని జాతులు మళ్లీ స్వతంత్ర దేశాలుగా విడిపోయాయి. ప్రపంచీకరణ తర్వాతనే గదా ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ మాటకొస్తే జాతులు స్వతంత్ర దేశాలుగా ఏర్పడడానికీ పెట్టుబడికీ సంబంధం ఉంది. పెట్టుబడిదారీ అభివృద్ధి వలనే యూరపులో అన్నీ స్వతంత్ర జాతుల దేశాలు ఏర్పడ్డాయి. భాషా రాష్ట్రాల ఆకాంక్ష వెనుక ఆ స్పృహ ఉన్నది.

మొత్తం రచనలో ఒక సున్నితమైన పరిశీలన ఏమంటే తెలంగాణ వారికి (నాయకులకీ అందులో కెసిఆర్‌కే అని ఆయన అనవచ్చు) జ్ఞానము, వివేకము లేవని. భట్టి విక్రమార్కుల పోలిక వివేకానికి సంబంధించింది. ఇంక ముగింపులో స్పష్టంగానే చెప్పారు. అజ్ఞానులయిన తెలంగాణ ప్రజలను ఇక బాసర జ్ఞాన సరస్వతి రక్షించాల్సిందేనని.

తెలంగాణకు అన్ని వనరులు ఉన్నాయి, ఒక్క సముద్రం తప్ప- అని సాధారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తన వనర్లతో తాను స్వయం సమృద్ధిగా ఉండగలదనడానికి చెప్తూ ఉంటాం. తెలంగాణ సముద్రాన్ని కోస్తాపాలకులు కొల్లగొట్టారనో, దోచుకున్నారనో ఎంత ఆవేశంలోనైనా, ఎంత నోరు పారేసుకున్న సమయంలోనైనా నరేంద్ర, కెసిఆర్‌లు కూడా అన్నారనుకోను. కాని వెక్కిరింత చూడండి. ‘విశాఖ, కాకినాడ, బందరు, చీరాల, కొత్త పట్నంలలో ఓడరేవులు ఉండగా, కనీసం ఒక్కటైనా తెలంగాణలో లేదనీ, ఇదొక పెద్దకుట్ర అనీ అంటే ఎవరేం చెప్పగలరు?’ (నాబోటివాడైతే తెలంగాణ భవన్‌ను నిర్మించిన శ్రీకాకుళం శ్రామికులను మీరు గుర్తుచేసినట్లుగా, మీరు పేర్కొన్న ఓడ రేవులలో విశాఖపట్నం తప్ప సువిశాల సముద్ర తీరప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఇంకెక్కడా ఓడరేవులు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తాడు). ఇంకా శ్రీరమణ చేసిన కొన్ని సూత్రీకరణలను చూద్దాం.

‘హైదరాబాదు ముఖ్యపట్టణం అయింది. ఉద్యోగ, వ్యాపార, యితర రంగాలలో ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి సహజంగా అన్ని వర్గాలవారు అక్కడికి చేరతారు. అదేమీ అపరాధమూ కాదు. దోపిడీ అంతకంటే కాదు’. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగు వాళ్లంతా ఉపాధి అవకాశాలకు తమ రాజధాని నగరానికి చేరడం సహజమే. అట్లా చేరినచోట ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల ఉపాధికి భంగకరమై ముల్కీ, ఆరు సూత్రాలు, ఆరు వందల పది జి.వో. వంటివి అవసరమైన సందర్భాలు తప్ప అది అపరాధమూ కాదు. కాని చేరిన వాళ్లలో ముఖ్యంగా వ్యాపార, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార రంగాల్లో దోపిడీ చేయడానికి చేరినపుడే వైమనస్యాలతో ప్రారంభమై ఘర్షణ స్థాయికి చేరుకుంటాయి స్పర్థలు. అసలు ఉపాధికి ఎక్కడికైనా పోవడానికి అది తమ రాజధానే కానక్కర్లేదు. ఆ మాటకొస్తే చిరకాలంగా షోలాపూర్‌కు వలసపోవడం దగ్గర్నించి భివాండి, సూరత్, బొంబాయిలకు, వస్తుపరిశ్రమల కు వేలాది (లక్షలాది?) గా ఉపాధి కొరకు తరలిపోయిన వాళ్లంతా తెలంగాణ శ్రామికులే. బొంబాయి మహానగర నిర్మాణంలో తెలంగాణ జిల్లాల నుంచి వెళ్లిన శ్రామికుల పాత్ర ఎంతో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో పాలమూరు నుంచి లక్షలాదిగా వలస పోతున్న కరువు జీవులే ఉన్నారు. పంజాబ్ వ్యవసాయాభివృద్ధి అంతా బీహార్ వ్యవసాయకూలీల మీదనే సాధ్యమైంది. ఢిల్లీలో రిక్షా కూలీలు కూడా బీహార్ వాళ్ళే. ఢిల్లీలో ఏసియాడ్ క్రీడల సందర్భంగా నిర్మాణమైన సిరిఫోర్ట్ నగరాన్ని ఒరిస్సా కార్మి కులు నిర్మించారు. తెలంగాణ భవన్‌ను శ్రీకాకుళం శ్రామికులు నిర్మించినట్లే, హైదరాబాదు నగరంలో రియల్ ఎస్టేట్ నిర్మాణాల్లో బిల్డర్లు ఎక్కువగా వినియోగించే మేస్త్రీలందరూ ప్రకాశం జిల్లా వాళ్లే. దోపిడీ ప్రశ్న అయినా, ప్రత్యేక రాష్ట్ర డిమాండు అయినా ఇట్లా ఒళ్లు అమ్ముకొని బతికేవారి గురించి రాదు. ఎందుకంటే వాళ్లు దూరదూరాలు వెళ్లి తమ ఒళ్లు అమ్ముకొని మళ్లీ పనిచేయడానికి ఉపాధికోసం అర్రులు చాస్తున్నారు తప్ప అక్కడివేవీ దోచుకొచ్చి తాముపుట్టిన ఊరిలో దాచుకోవడంలేదు. వాళ్లు శ్రమగా పోతున్నారు. పెట్టుబడిగా పోవడం లేదు. అంతేకాదు వాళ్ల శ్రమ అదనపు విలువగా మారి పెట్టు బడిదారుకు, యజమానికి ఒనకూరుతున్న లాభాలలో వాళ్లకు పూచిక పుల్ల కూడా చెందడం లేదు. శ్రీరమణ చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదుకు తరలి రావడం ఒక అభివృద్ధి చిహ్నంగా ప్రస్తావించారు. అది మర్రి చెన్నారెడ్డి కృషి అయినా, అక్కినేని నాగేశ్వరరావు కృషి అయినా ఒక ప్రశ్న: అయితే మరి తెలంగాణ నడిబొడ్డున చలనచిత్ర పరిశ్రమ నెలకొల్పి అభివృద్ధిపరుస్తున్న క్రమంలో తెలంగాణ కళాకారులకు, నటులకు, సాంకేతిక జ్ఞానం గలవారికి లభించిన న్యాయమైన అవకాశం ఎంత? దానినొకసారి మద్రాసు మహా నగరంతోనే పోల్చండి. ఇవ్వాళ్టికీ అక్కడా మీరే, ఇక్కడా మీరే. ఏభై నాలుగేళ్ళుగా ఆ మహానగరం మీదికాకున్నా మీరే (తెలుగునేలకు అంచునే-అందునా ఇటు కోస్తాకు, అటు రాయలసీమకు ముఖ్యంగా నెల్లూరు, కడప జిల్లాలకు భోగోళికంగా దగ్గరగా ఉన్నది. ఇంక ప్రకాశం ఇతర దక్షిణ కోస్తా జిల్లాలకు పెట్టుబడి వల్ల దగ్గరగా ఉన్నది), ఈ మహానగరం నాలుగువందలేళ్లుగా తెలంగాణ వారిదై, ఏభైఏళ్లుగా మీదికూడా అయినందునా మీరే. ఉపాధిలో కాదు, ఆధిపత్యంలో మీరు. కొన్ని ఉదాహరణలు మీరే ఇచ్చారు. ఎన్నైనా ఇవ్వొచ్చు. ‘పత్రికారంగానికి, పుస్తక ప్రచురణ సంస్థలకు విజయవాడ మక్కాగా ఉండేది’. మేమంటున్నదీ అదే విజయవాడ మక్కాగా ఉన్నప్పుడు ముల్లాలు విజయవాడ వాళ్ళే. హైదరాబాద్‌కు మారినాక కూడా వాళ్లే. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినందుకే కాదు, రేపు తెలంగాణకు రాజధాని అయినాక కూడా అదే స్థితి ఉండదని భరోసా లేదు. తెలంగాణ ప్రజల తెలివితేటల పట్ల ఎంత చిన్న చూపు! ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వం తెలంగాణలో తెలుగు, ఉర్దూ (ఇంకా ఇతరభాషల్లో) పత్రికలు, పుస్తకప్రచురణ సంస్థలు లేవా? ఇట్లా విడిగా కూడా మాట్లాడుకోవడమెందుకు? మరో అద్భుతమైన సూత్రీకరణ శ్రీరమణ ఇంకాస్త ముందుకు వెళ్లి చేయనేచేశారు. ‘ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మొత్తంమీద జనసామాన్యంలో రాజకీయ చైతన్యాన్ని పెంచింది’.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51) కాలంలో జన సామాన్యం మరి భారతదేశంలోనే అపూర్వంగా ఏ చైతన్యంతో పోరాడినట్లు? మొత్తం తెలుగునేల మీద కూడా రాజకీయ చైతన్యం పదునెక్కిన సందర్భాలు- (అ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- ఇది బందగీ పోరాటంతో ప్రారంభమై క్రమక్రమంగా ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో వికసించింది; (ఆ) శ్రీకాకుళం ఆదివాసీ రైతాంగ పోరాటం- వెంపటాపు సత్యం, కైలాసంల నాయకత్వంలో ప్రారంభమై తెలుగునేలంతా, ముఖ్యంగా మరోసారి 1968 నుంచి తెలంగాణను ప్రభావితంచేసింది. 1972 లో వెనుకపట్టు పట్టినా తెలంగాణలో చల్లారకుండా మిగిలిన ఈ విప్లవాగ్నులే జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలలో మహాజ్వాలలలో ఈనాటికీ ఎన్నో నిర్బంధాలు, చిత్రహింసలు, హత్యలు సహించి, త్యాగాల చాలు అయింది. దేశానికే ఒక దిక్సూచి అయింది. 1983లో అందుకే ఎన్టీఆర్ నక్సలైట్లకు జోహార్లు అనీ, నక్సలైట్లు తనతో చేతులు కలిపితే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తాననీ నర్సంపేట, ఏటూరునాగారం సభల్లో చెప్పాల్సివచ్చింది. శ్రీరమణ ‘ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం’ తెచ్చిందనుకుంటున్న రాజకీయ చైతన్యం నిజానికి సారాంశంలోకి వెళ్లి చూస్తే రాడికల్ ఉద్యమం వల్ల వచ్చింది. 1968-69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను ప్రతిఫలించింది.

ఇంకొక సూత్రీకరణ: ‘హైదరాబాదులో స్థలాలను పొలాలను ఎవరూ ఎవరికీ ఉచితంగా ధారపోయలేదు. బతుకుతెరువు ఎక్కడ ఉంటే మనిషి అక్కడకు వెళతాడు’. బతుకుతెరువు ఎక్కడ ఉంటే మనిషి అక్కడకు వెళతాడని అనడానికి పాలమూరు, తెలంగాణ మొదలు బీహార్, ఒరిస్సా శ్రమ జీవుల వరకు నేను పైన ఉదాహరించాను. కాని వీళ్ళెవరూ స్థలాలను, పొలాలను కొనడానికి వెళ్లలేదు. బలి చక్రవర్తి వామనునికి తాను పాలించే నేలను, తన తలను ఉచితంగా ధారపోశాడో లేదో తెలియదుకానీ తెలంగాణ ప్రజల భూములను ముఖ్యంగా హైదరాబాదు పరిసర జిల్లాల భూములను ప్రభుత్వాలు దళారుల మొదలు బహుళజాతికంపెనీల వరకు ‘ఉచితంగా ధారపోస్తున్న’ ఉదాహరణలు శ్రీరమణ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలోనే ఇటీవల రోజూ చదువుతూనే ఉండివుంటారు.

హైదరాబాద్ నగరంలో బహుశా ప్రపంచంలో అంతటా వైద్యశాలల్లో నర్సులు కేరళనుంచి వచ్చిన మహిళలు ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ వీరిని తమను దోచుకోవటానికి వచ్చినవాళ్లుగా భావించరు. తమ బతుకు తెరువు కోసం సేవాభావంతో వచ్చిన వాళ్లుగానే చూస్తారు. మార్వాడీ తమిళ పెట్టుబడిదారులు ఎక్కడ ఏ సంస్థ స్థాపించినా యజమాని, మేనేజర్ మొదలు చిన్న ఉద్యోగం దాకా (హోటల్ పెడితే సప్లయర్, క్లీనర్ కూడా) తమ వాళ్లను తెచ్చుకుంటారు. (ఇది దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా వర్తిస్తుంది) ఇట్లా మొత్తం యూనిట్‌గానే తరలివచ్చి పెట్టుబడి ఇక్కడ తిష్ఠవేయడాన్ని స్థానికులు ఈ ఉదాహరణలతో చెప్పుకుంటారు. అది కూడా ముఖ్యంగా తాము పుట్టి, పెరిగి, కష్టం చేస్తున్నచోట తమకు ఉపాధి లభించకుండా పోయినపుడు. అది పొట్టచేత బట్టుకొని వచ్చినవాళ్లను అందులోనూ శ్రామికులను వెక్కిరించడం కాగలదు. అటువంటి అపోహలతో , ఆరోపణలతో ఉద్యమాలు నిర్మాణం కావు. బతుకుదెరువు, శ్రమ వేరు. అమ్మడం, కొనడం వేరు. ఉపాధి వెతుక్కోవడం వేరు. దోపిడీ మార్గాలు వెతుక్కోవడం వేరని కొత్తగా బాసర జ్ఞాన సరస్వతి చెప్పనక్కర లేదు.